జీవితం ఎప్పుడు అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితమే కాదు. చీకటి తర్వాత వెలుగున్నట్టే సమస్యలు ఎల్లకాలం ఉండవు అట్లే సుఖాలు కూడ. ఇది గ్రహించి జీవితాన్ని ఆస్వాదిస్తూ సాగితే ప్రతీ అమావాస్యలో నిండు పున్నమి కనిపిస్తుంది." "బావా నన్ను సినిమాకు తీసుకువెళతాను అన్నారు గుర్తుందా?" కచేరీ నుండి వచ్చిన నన్ను వినీల చిన్న పిల్లలా అడిగింది. ఆమె అందమైన మోము చూస్తూనే నా అలసట అంతా పోయింది. "మరి నా మామూలు ఇస్తేనే సినిమాకు" సరసమాడెను. ఆమె సిగ్గుపడింది. "ఛీ పొండి" అంటూనే కౌగిట్లో వాలింది. "తమిళంలో మంచి హిట్ అయ్యింది. సూర్య సూపర్ ఏక్షన్ చేశాడు. హీరోయిన్ అయితే చాలా అందంగా ఉందంట. తొందరగా వెళ్దాం పదండి ప్లీజ్" గోముగా అడిగింది. సూర్య ఆమె ఫేవరెట్ హీరో. నాతో అతన్ని పోలుస్తూ సంబరపడుతూ ఉంటుంది అచ్చం నందినీ లాగే.. "ఒకే డార్లింగ్ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రెడీగా ఉండు ఎంతైనా సూర్య సినిమా కదా" కన్ను గీటుతు అన్నాను. ఆమె సన్నగా నవ్వింది. వినీల నా పంచప్రాణాలు. నా జీవితానికి చుక్కాని. ఆరిపోతున్న నా జీవితానికి కొత్తకాంతిని అందించిన దేవత. అందుకే ఆమె ఇష్టాన్ని నేను ఇష్టంగా తీరుస్తాను. థియేటర్ ముందు చాలా రష్ ఉంది. టికెట్స్ దొరకవేమో అని వినీల భయపడింది. ఆమె భయపడ్డట్టు టికెట్స్ దొరకలేదు. ఆమెను నిరాశ పెట్టడం ఇష్టం లేక బ్లాక్ లో టికెట్స్ సంపాదించాను. " హీరోయిన్ ఎవరంట?" వినీల ను ఆరాతీసాను. " ఏమో కొత్త హీరోయిన్. పేరు గుర్తలేదు. కానీ సూపర్ గా ఉందే పోస్టర్ గాని, ట్రైలర్ గాని చూడలేదా" నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అడిగింది. " ఏమో నేను గమనించలేదు"అంటూ ఆసక్తిగా స్క్రీన్ చూసాను. " నందినీ శంకర్ " నాకు బాగా పరిచయం ఉన్న పేరు లా అనిపించింది. ఒకవేళ ఆమె నా నందూ కాదుగా అని ఆత్రుతగా చూసాను. అవును ఆమె నా నందినీయే..నా నందూ...నా మనసు గట్టిగా అరిచింది..నా గుండె వేగంగా కొట్టుకుంటుంది..నా కన్నులలో చిన్నటి చెమ్మ చేరింది. నా పెదవులు అప్రయత్నంగా ఆమె పేరును పిలిచాయి..నా పేరులో సగం తనపేరుకు పెట్టుకుంది అంటే నన్నింకా మర్చిపోలేదా..??? ఆమె మనసులో నేనింకా సజీవo గా ఉన్నానా? ఆమె చేసిన వాగ్దానం మర్చిపోలేదా..ఇలా ఆమె ఆలోచనలు మదిలో ముసురుకోవడం తో నా అనుమతి లేకుండనే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. అవి కాలేజీ రోజులు. జీవితం అందంగా యెటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఓ చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరం క్యాంపస్ గార్డెన్ లో కూర్చున్నాం. కుహూ కుహూ మని కోయిల రాగాలు తీస్తూ తనతో జత కూడమని అజ్ఞాపిస్తోంది. ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చెయ్యడంతో ఓ మధురమైన పాట పాడాను. మొదటిసారి నా సొంతంగా అల్లిన పాట పాడాను. నా పాట వింటున్న కొమ్మ మీద కోయిల తన రాగాన్ని నాతో జత చేసింది. మరుసటిరోజు కాలేజి లో ఓ అందమైన అమ్మాయి పలకరించింది. "హాయ్ మీరు రవి శంకర్ కదూ" ఆమె కన్నా ఆమె గొంతు ఇంకా అందంగా ఉంది. "అవును మరి మీరు..." అయోమయంగా అడిగాను. అంత అందమైన అమ్మాయి నాతో మాట్లాడడం అదే మొదటిసారి. "నా పేరు నందినీ జోసెఫ్. బీ టెక్ సెకండ్ ఇయర్ సి ఎస్ ఇ.." తనని తాను పరిచయం చేస్తూ"నిన్న మీరు పాడిన పాట అద్భుతం. నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. మీరు చాలా బాగా పాడారు. ఎక్కడ నేర్చుకున్నారు.?" అంటూ తన రికార్డింగ్ చూపించింది. " అబ్బే అలాంటిదేం లేదండీ. అసలు నాకు మూజిక్ రాదు ఏదో అప్పుడప్పుడు ఇలా పాడుతూ ఉంటా అంతే" సిగ్గుపడుతూ చెప్పాను. " నిజంగానా.!!. ప్రాక్టీస్ లేకుండా ఇంత అద్భుతంగా పాడితే మరి క్లాసిక్స్ నేర్చుకుంటే ఇంకెత బాగా పాడే వారో?.. ఏని వే నైస్ మీటింగ్ యు..బై " అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆమె తాకిన చేతిని చూస్తూ నిల్చున్నాను. ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి" మీరు ఏం అనుకోను అంటే చిన్న కంప్లేమెంట్ మీరు అచ్చం హీరో సూర్య లా ఉన్నారు..మీరిద్దరూ కవలలు అన్న ఎవరైనా నమ్మేస్తరు"అని నవ్వుతూ వెళ్లిపోయింది. అలా రోజు నన్ను చూడగానే నవ్వేది పలకరించేది. నా నోట్స్ అడిగి తీసుకునేది. నాతో పాడించుకునేది. అలా మాకు తెలియకుండానే మా మధ్య ఇంకేదో బంధం పెనవేసుకుంది. ఏడాది గడిచేకొద్దీ మనసులోమాట బయటపెట్టేసుకున్నాం..ఇంకో ఆర్నెల్లు ప్రేమ యాత్ర చేసుకుని అలసిసొలసి పెళ్ళిచేసుకోవాలని నిర్ణయానికి వచ్చేశాం. పెద్ద వాళ్ళతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నాం. ఆమె క్రిస్టియన్. నేను హిందు. స్వతహాగా మా అమ్మ నాన్న చాలా పట్టింపులున్న వాళ్ళు. ఆమెను కోడలిగా తెస్తే విషం తాగుతాము అని బెదిరించారు. నందినీ ఫాదర్ కూడా మా పెళ్ళికి రెడ్ సిగ్నల్ ఇవ్వడం తో చేసేది లేక బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయానికి వచ్చాను. ఒకప్పుడు నేను నెమ్మది మనిషిని. కుటుంబం అంటే ఎంతో ప్రేమ. అలాంటి నేనే లేచిపోవడం గురించి మాట్లాడాను అంటే నందినీ ప్రేమ నన్నేంతగా మార్చిందో. ఆమె లేని నా జీవితం వృధా అనిపించింది. ఆమెను నేను వదులుకుని ఉండలేను. అందుకే తర్వాతైనా అమ్మ వాళ్ళను ఒప్పించవచ్చు. నా నిర్ణయాన్ని నందినితో చెప్పా. మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. తన తండ్రికి మోసం చేస్తే జీసస్ క్షమించడు అంది. తను లేక పోతే తన తండ్రి బతకడు అని వాదించింది. చివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో గోవా బయలుదేరింది. ఊరు కాని ఊరు. ఎక్కడుండాలో తెలియక ఒక హోటల్ రూం తీసుకున్నాం. నా స్తోమత కది పెద్దదే అయినా నందినీ కోసం తీసుకున్నా. ఆ రాత్రి ఆమె చాలా అందంగా ఉంది. మౌనం గా ఉన్న ఆమెను కదిలించాలి అని మా పెళ్ళికి తెచ్చిన చీర ఆమెకిచ్చి ఒకసారి కట్టుకోమని అన్నాను. "కానీ నాదగ్గర బ్లౌజ్ లేదు. " ఆమె తలవంచి సిగ్గు పడుతూ చెప్పింది. " నో ప్రోబ్లం" మనసులో మాట పెదవులు దాటింది. ఆమె సిగ్గు పడుతూ నా చేతుల్లోన్చి చీర లాక్కుని పోయింది. సాయంకాలపు సూర్యుడు వెళ్ళిపోయినా ఆకాశం ముద్దమందారం లా ఎర్రగా ఉంది. కిటికీలోంచి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంటే , నింగిని తాకాలని ముచ్చట పడుతున్న అలలను చూసి నందినీ నీ నన్ను పోల్చుకున్నా. మువ్వల సవ్వడి విని వెనక్కి తిరిగాను. ఒక్కసారి నా కళ్లముందు మెరిసిన మెరుపుతీగ ను చూసి అసలింత అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని సందేహం కలిగి ఆమెనే అలా చూస్తూ ఉండిపోయా. గంధర్వ కన్నెలు మించిన అందం యెటువంటి ఋషుల తపస్సునైనా భగ్నం చేసే నా నెచ్చెలి సొగసు చూసి మైమరచి అలా బొమ్మలా ఉండి పోయాను. "థాంక్స్" ఆమెను అలా చూస్తూనే చెప్పాను. ఆమె హాయిగా నవ్వింది. ఆ నవ్వు చాలు శవానికైన ప్రాణం పోస్తుంది. ఆమె వచ్చి నా కోగిట్లో వాలి పోయింది. నన్ను నేను సంభాళించుకున్నాను ..ఆమెకి దూరంగా జరిగాను. ఆమె నన్ను అలా చూస్తూ ఉంది. "పెళ్ళికి ముందే వద్దు నందూ" తల అటుగా తిప్పుకుని ఒక్కో మాట కూడ బలుక్కుని చెప్పాను. ఆమె ఏం అర్దం చేసుకుందో కానీ నన్ను వెనుకనుండి వాటేసుకుని " ఇప్పుడు మనకు పెళ్లి కాలేదు అని ఎవరు అన్నారు. ఎప్పుడయితే మన మనసులు కలిసాయో అప్పుడే మన పెళ్ళి అయ్యింది. ఇప్పుడు కేవలం ఒక తంతు మాత్రమే" ఆమె సమాధానం నన్ను నివ్వెర పరిచింది. చెలియ స్పర్శకు చలించని ముని ఎవడు? నేను అంతే..ఆ రాత్రి నిద్రపోలేదు అది మా శుభరాత్రి అయ్యింది. రవికాంచని ఆ సొగసు ఈ రవి కాంచగా..తెలతెలవారుతుండగా నిద్ర పట్టేసింది. అలసి సొలసిన నా దేహాన్ని సూర్యుని కిరణాలు ముళ్లులా తాకుతుండగా మెల్లగా కళ్లు తెరిచాను. ఆమె చంద్రవదనాన్ని ఒకసారి వీక్షించాలని నిద్రమత్తులో ఆమె కోసం వెదికాను ..ఆమె లేదు. "నందూ" మెల్లగా పిలిచా బదులు లేదు. నా మత్తు వదిలింది. ఆమెకై గది మొత్తం వెదికాను..ఆమె జాడ లేదు. ఆమె నంబర్ ట్రై చేశా .స్విచెడ్ ఆఫ్ అని వస్తోంది. రిసెప్షన్ లో అడిగా ..ఒక లెటర్ ఇచ్చారు. పరుగు పరుగున నా రూం కి వచ్చి ఆత్రుతగా చదివాను. నా మనసు కీడు సంకిస్తోంది. " డియర్ రవి, ఈ ఉత్తరం చదివి నీ మనసు ముక్కలవుతుంది అని తెలుసు. నన్నో తప్పుడు మనిషిగా ఊహించుకుంటాు అని తెలుసు. కానీ ఓ కూతురిగా నేను నిర్వర్తించాల్సిన నా బాధ్యత నన్నీ పని చేయిస్తోంది. నేను లేకుండా నువ్వు బతకలేవనీ తెలుసు. నేను నీతో లేచిపోతే మా నాన్న నాకు దక్కరని తెలుసు. ప్రేమ పేరుతో నీకు దగ్గర అయ్యింది నేనే..నీ మనస్సు లో కోటి ఆశలు రేపింది నేనే అందుకే నీకో తీపి జ్ఞాపకం ఇచ్చి నీ ఋణం తీర్చుకోవాలి అనుకున్నా. నీ లాంటి ప్రేమికుని పొందడం నా అదృష్టం . నన్ను నన్నుగా ప్రేమించేవారు ఉన్నారని తెలిపావు. నా జీవితoలో ఈ రాత్రి నీ ఎన్నటికీ మర్చిపోను. నా జీవితం లో నీ స్థానం ఎవ్వరికీ ఇవ్వను. నేనెప్పడూ నీ నందినీ శంకర్ నే .. ప్రామిస్. ప్రేమతో , నీ నందూ లెటర్ చదివి కుప్పకూలి పోయాను. కళ్లు తెరిచేసరికి రూం బాయ్ ఎదురుగా ఉన్నాడు. "యేని ప్రోబ్లం సర్" వినయంగా అడిగాడు. "నో ప్రోబ్లం , యు కెన్ లీవ్" నీరసంగా చెప్పాను. నాకు మచ్చేమటలు పట్టేసాయి. న్నో అలా జరగడానికి వీళ్లేదు. ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్ళలేదు. ప్రేమ అంటే తెలియని నాకు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించి ఇలా పిచ్చివాన్ని చేసి వెళ్ళలేదు..నందినీ నా ప్రాణం .ఆమె కోసం నా కుటుంబాన్ని వదిలివచ్చాను . ఆమె అందాన్ని నేనెన్నడూ మోహించలేదు. ఆమె సాంగత్యం కోరుకున్నా. నా ఆత్మను,నా పేరును, ఆఖరికి నా శరీరాన్ని పంచుకున్న నా జీవన సౌధం. ఆమె లేని జీవితం చంద్రుడు లేని రేయివంటిది. ఆమె నన్నిలా మోసం చేసి వెళ్ళిపోలేదు. ఇలా ఆలోచిస్తూ ఆమెకై వెదికా. రైల్వే స్టేషన్లో,బస్ స్టాప్ లో అన్ని చోట్ల పిచ్చివాడిలా వెతికా. ఆమె ఇంటికి వెళ్ళాను . తాళం వేసి ఉంది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెల్లిపోయారని తెలియడంతో నా స్వప్న సౌధాలు కూలిపోయాయి. పిచ్చివానిగా మారిపోయాను. లోకం నన్నో ప్రేమ పిచ్చోనిగా జమ కట్టేసింది. రోడ్డు మధ్యలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా ఏడ్చే వాడిని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆత్మహత్య యత్నాలు చేశాను. నేను ప్రేమించమని ఆమెను అడిగానా ?లేదే . ఆమె వచ్చింది. ప్రేమ నింపింది. అన్యాయంగా వదిలి వెళ్ళింది. ప్రేమించే అప్పుడు వల్ల నాన్న గుర్తుకు రాలేదా? ఇప్పుడు పరువూ ప్రతిష్టనా..ఆమెను ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా కావట్లేదు. ఆమె నా ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంది. కామ దాహాన్ని తీర్చుకోవడం ప్రేమ అని భ్రమించి, తన తండ్రి నీ ఎదిరించే ధైర్యం లేక మా ప్రేమకు సమాధి కట్టింది. కానీ నేను తన ప్రేమకై పిచ్చివాడిని అయ్యాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నా. తాగి తాగి ఒళ్ళు గుళ్ల చేసుకున్నా. అటువంటి సమయంలోనే నా మరదలు వినీల నా జీవితం లో ఒక దేవతలా వచ్చింది. నా అర్ధాంగి లా మారి నా జీవితాన్ని చక్కదిద్దేందుకు పూనుకుని నన్నో మామూలు మనిషిగా మార్చింది. ఆమె జ్ఞాపకాల్ని నా మనసులోంచి పెకిలించి, నాకో కొత్త జీవితాన్ని ఇచ్చింది. అమావాస్య నిండిన నా జీవితంలో కొత్త వెలుగును నింపి నిండు పున్నమి తెచ్చింది. కలకానిది విలువైన బ్రతుకును కన్నీటి ధారలతో బలిచెయ్యకుండా నన్ను సంగీత విద్వాంసున్ని చేసి సంఘంలో గౌరవం తెచ్చిపెట్టింది. "ఆమె గుర్తుకు వచ్చిందా?" మౌనంగా బయటకు వస్తున్న నన్ను వినీల నా భుజం మీద వాలుతూ అడిగింది. "నీకెలా తెలిసింది?" ఆమె పరిశీలనా శక్తికి ఆశ్చర్యపోతూ నా ప్రశ్నతో సమాధానం ఇచ్చాను. "ఇంటర్వల్ లో కూడా స్క్రీన్ నే చూస్తూ ఉన్నారుగా?" చిరుకోపంతో అంది. " సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసేసరికి గతం గుర్తుకువచ్చింది." ఆమె రియాక్షన్ కోసం ఎదురుచూస్తూ చెప్పాను. "ఆమె చాలా అందంగా ఉంది . అచ్చం ఋనికర్ బొమ్మలా.." నిర్మలమైన నవ్వుతో చెప్పింది. "పరిమళం లేని రాతి పువ్వు" మనసులో మౌనంగా అనుకుంటూ వినీలను మరింత దగ్గరగా తీసుకుంటూ ముందుకు నడిచాను.
No comments:
Post a Comment